Sunday, February 20, 2005

ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు

రాగం: అఠాణ
తాళం: ఆది


పల్లవి:
ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు ॥ఏ॥


అనుపల్లవి:
బాల! కనకమయచేల! సుజనపరి
పాల! శ్రీరమాలోల! విధృతశర
జాల! శుభద! కరుణాలవాల! ఘన
నీల! నవ్య వనమాలికాభరణ! ॥ఏ॥


చరణము(లు)
రారా దేవాదిదేవ! రారా మహానుభావ!
రారా రాజీవనేత్రా! రఘువరపుత్రా!
సారతర సుధాపూర హృదయ పరి
వార జలధిగంభీర దనుజ సం
హార దశరథ కుమార బుధజన వి
హార సకలశృతిసార నాదుపై ॥ఏ॥


రాజాధిరాజ! మునిపూజితపాద! రవి
రాజలోచన! శరణ్య అతిలావణ్య!
రాజధరనుత! విరాజ తురగ! సుర
రాజవందిత పదాజ! జనక! దిన
రాజకోటి సమతేజ! దనుజగజ
రాజ నిచయ మృగరాజ! జలజముఖ! ॥ఏ॥


యాగరక్షణ! పరమ భాగవతార్చిత!
యోగీంద్ర సుహృద్భావిత! ఆద్యంతరహిత!
నాగశయన! వరనాగ వరద! పు
న్నాగ సుమధుర! సదాఘమోచన! స
దాగతిజ ధృతపదా! గమాంతరచర!
రాగ రహిత! శ్రీత్యాగరాజ సుత ॥ఏ॥

Friday, February 04, 2005

ఏమి జేసిన నేమి? శ్రీరామ స్వామి కరుణ లేని వారిలలో

రాగం: తోడి
తాళం: చాపు

పల్లవి:
ఏమి జేసిన నేమి? శ్రీరామ
స్వామి కరుణ లేని వారిలలో ॥నేమి॥

అను పల్లవి:
కామమోహ దాసులై శ్రీరాముని
కట్టు తెలియని వారిలలో ॥నేమి॥

చరణము(లు)
ఇమ్ము కలిగితే నేమి ఇల్లాలికి
సొమ్ము బెట్టితే యేమి
కమ్మవిల్తు కేళిని దెలిసియేమి
తమ్మికంటి వాని కరుణలేనివా రిలలో ॥నేమి॥

సవము జేసితే నేమి కలిమికి పుత్రో
త్సవము గలిగితే నేమి
భువిలో నన్యబీజ జనితునిఁ గొనియేమి
శివకర శ్రీరాముని దయలేని వారిలలో ॥నేమి॥

మేడఁగట్టితే నేమి అందున లందరు
జోడు గట్టితే నేమి
చేడి యలను మెప్పించఁ గెలిసెతే నేమి
ఈడులేని రాముని దయ లేనివా రిలలో ॥నేమి॥

రాజ్యమేలితే నేమి బహుజనులలో
పూజ్యులైతే నేమి
ఆజ్య ప్రవాజముతో నన్న మిడితే నేమి
పూజ్యుఁడైన రాముని దయ లేని వారిలలో ॥నేమి॥

గురువు తానైతేనేమి కంటికి మేను
గురువై తోచితే నేమి
పరమంత్రమన్యుల కుపదేశించితే నేమి
వర త్యాగరాజనుతుని దయ లేని వారిలలో ॥నేమి॥

ఏమని మాట్లాడితివో రామ ఎవరి మనసుకే విధమో దెలిసి

రాగం: తోడి
తాళం: ఆది


పల్లవి:
ఏమని మాట్లాడితివో రామ
ఎవరి మనసుకే విధమో దెలిసి ॥ఏ॥


అను పల్లవి:
మామ మరుదులనుజులు తల్లిదండ్రులు
భామలు పరిజనులు స్వవశమౌట కే...


చరణము(లు)
రాజులు మునులు సురారులు వర ది
గ్రాజులు మరి శూరులు శశధరదిన
రాజులు లోబడి నడువను త్యాగ
రాజవినుత నయభయముగ ముద్దుగ ॥ఏ॥

ఏమని పొగడుదురా శ్రీరామ ని

రాగం: వీరవసంత
తాళం: ఆది


పల్లవి:
ఏమని పొగడుదురా శ్రీరామ ని ॥న్నే॥


అను పల్లవి:
శ్రీమన్నభోమణి వంశల
లామ భువనవాసీ మారామ ని ॥న్నే॥


చరనము(లు)
శివునికిఁ దామసగుణమిచ్చి కమల
భవునికి రాజసగుణమొసఁగి శచీ
ధవుని గర్వహృదయునిగాఁ జేసిన
దాశరథీ త్యాగరాజ వినుత ని ॥న్నే॥

ఏమందునే విచిత్రమును? ఇలలోన మనుజులాడున

రాగం: శ్రీమణి
తాళం: దేవాది


పల్లవి:
ఏమందునే విచిత్రమును? ఇలలోన మనుజులాడున ॥దేమందునే॥


అను పల్లవి:
నీ మంత్ర మహిమ నెఱుగలేక
సామాన్యులై పల్కెదరు నీతో ॥నేమందునే॥


చరణము(లు)
తామసంబుచేత తత్త్వముఁబల్కుచు
కామదాసులై కరుణమాలి మదిని
భూమిసంచరించి పొట్టనింపుచును
తామే పెద్దలట; త్యాగరాజనుత! ॥ఏమందునే॥

Wednesday, February 02, 2005

ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో

రాగం: భైరవి
తాళం: ఆది

పల్లవి:
ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో ॥ఏ॥

అను పల్లవి:
శ్రీనాథ బ్రహ్మకైన నీదు సేవ దొరకునా తనకు గలిగెను ॥

ఏ॥చరణము(లు)
నేను గోరిన కోర్కులెల్లను నేఁడు తనకు నెరవేరెను
భానువంశతిలక నా పాలి భాగ్యమా సజ్జన యోగ్యమా ॥ఏ॥

నీదు దాపు నీదు ప్రాపు దొరికెను నిజముగా నే నీసొమ్మైతిని
ఆది దేవ ప్రాణనాథ నా దంకమున పూజింప తన ॥కే॥

సుందరేశ సుగుణబృంద దశరథనంద నారవిందనయన పావన
అందగాఁడ త్యాగరాజనుత సుఖమనుభవింప దొరకెరా భళీ తన ॥కే॥

ఏతావునరా నిలుకడనీకు - ఎంచిచూడ నగపడవు

రాగం: కల్యాణి
తాళం: దేశాది

పల్లవి:
ఏతావునరా నిలుకడనీకు - ఎంచిచూడ నగపడవు ॥ఏ॥


అను పల్లవి:
సీతా గౌరీ వాగీశ్వరి యను
స్త్రీ రూపములందా గోవిందా ॥ఏ॥


చరణము(లు)
భూకమలార్కానిల నభమందా
లోకకోటు లందా
శ్రీకరుఁడగు త్యాగరాజ కరార్చిత

ఏటి యోచనలు చేసేవురా ఎదురుబల్కు వారెవరు లేరురా

రాగం: కిరణావళి
తాళం: దేశాది


పల్లవి:
ఏటి యోచనలు చేసేవురా
ఎదురుబల్కు వారెవరు లేరురా ॥ఏ॥

అను పల్లవి:
నోటి మాట జార్చఁగ రాదురా
కోటి వేల్పులలో మేటియైన నీ ॥వే॥

చరణము(లు)
మెండుశూరులతో వెనుక తీయవని
రెండుమాటలాడేవాఁడు గాదని
అండకోట్లఁ బాలించేవాఁడని
చండమౌనులాడ త్యాగరాజనుత ॥ఏ॥

ఎవరికై యవతార మెత్తితివో ఇప్పుడైన తెలుపువయ్యా! రామయ్య

రాగం: దేవమనోహరి
తాళం: చాపు


పల్లవి:
ఎవరికై యవతార మెత్తితివో
ఇప్పుడైన తెలుపువయ్యా! రామయ్య నీ ॥వె॥


అను పల్లవి:
అవనికి రమ్మని పిలిచిన మహరా
జెవడో వానికి మ్రొక్కేను రామ ॥ఎ॥


చరణము(లు)
వేద వర్ణనీయమౌ నామముతో
విధి రుద్రులకు మేల్మియగు రూపముతో
మోదసదనమగు పటుచరితముతో
ముని రాజవేషియౌ త్యాగరాజనుత ॥ఎ॥

ఎవరితోనేఁ దెల్పుదురామ! నాలోని జాలిని

రాగం: మానవతి
తాళం: దేశాది


పల్లవి:
ఎవరితోనేఁ దెల్పుదురామ! నాలోని జాలిని ॥ఎ॥

అను పల్లవి:
కవఁగొని సదా భజనసేయ కార్యములన్ని వేరాయె ॥ఎ॥

చరణము(లు)
గణ నాధుఁజేయఁగోర కడు వానరుండై తీరెగా
గుణ మయా మయాంబుద సమీర గోపాల
త్యాగరాజవినుత ॥ఎ॥