Monday, March 21, 2005

కంటఁజూడుమీ ఒకపరి క్రీ గం...

రాగం: లతాంగి
తాళం: దేశాది


పల్లవి:
కంటఁజూడుమీ ఒకపరి క్రీ గం...


అను పల్లవి:
బంటుఁడై వెలయు బాగుగాని తప్పు
తంటలెల్ల మానుకొన్న నన్నుఁ గ్రీ గం...


చరణము(లు)
అలనాఁడు సౌమిత్రి పాదసేవ
చెలరేగి సేయువేళ సీతతోఁ
బలికిఁ జూచినంత పులకాంకితుఁడై
బరగిన యటు త్యాగరాజుని క్రీ గం...

ఓరచూపు జూచేది న్యాయమా ఓ రఘూత్తమా నీవంటి వానికి

రాగం: కన్నడగౌళ
తాళం: దేశాది

పల్లవి:
ఓరచూపు జూచేది న్యాయమా
ఓ రఘూత్తమా నీవంటి వానికి ॥ఓ॥

అను పల్లవి:
నీరజాక్ష మును నీదాసులకు
నీకేటి వాపులు దెల్పవె ॥ఓ॥

చరణము(లు)
మానమించుకైన నీకుఁ దోచలే కపో
యిన వైనమేమి పుణ్యరూపమా
దీనరక్షక! శ్రిత మానవ సం
తాన! గానలోల! త్యాగరాజనుత ॥ఓ॥

ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెదవేరా? నే నీకు వేరా?

రాగం: ఆరభి
తాళం: చాపు


పల్లవి:
ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెద
వేరా? నే నీకు వేరా? ॥ఓ రాజీవాక్ష॥


అను పల్లవి:
నేరని నాపై నేరము లెంచినఁ
గారాదని పల్కెడు వారు లేని నన్ను ॥ఓ రాజీవాక్ష॥


చరణము(లు)
మక్కువతో నిను మ్రొక్కిన జనులకు
దిక్కు నీవని యతి గ్రక్కున బ్రోతువని
యెక్కువ సుజనుల యొక్క మాటలు విని
చక్కని శ్రీరామ దక్కితి గదరా ॥ఓ రాజీవాక్ష॥


మితి మేరలేని ప్రకృతిలోన దగిలి నే
మతిహీనుఁడై సన్నుతి సేయనేరక
బతిమాలి నీవే గతియని నెర న
మ్మితిగాని నిను మరచితినా సంతతము ॥ఓ రాజీవాక్ష॥


మావర సుగుణ ఉమావర సన్నుత
దేవర దయజేసి బ్రోవగ రాదా
పావన భక్తజనావన మహాను
భావ త్యాగరాజ భావిత ఇంక నన్ను ॥ఓ రాజీవాక్ష॥

ఓ రంగశాయీ బిలిచితే ఓ యనుచు రారాదా

రాగం: కాంభోజి
తాళం: ఆది


పల్లవి:
ఓ రంగశాయీ బిలిచితే
ఓ యనుచు రారాదా ॥ఓ॥


అను పల్లవి:
సారంగవరుఁడు జూచి కైలా
సాధిపుఁడు గాలేదా ॥ఓ॥


చరణము(లు)
భూలోక వైకుంఠమిది యని
నీలోన నీవే యుప్పొంగి
శ్రీలోలుఁడై యుంటే మా
చింత దీరే దెన్నడో ॥ఓ॥


మేలోర్వలేని జనులలోనే
మిరుల నొగిలి దివ్యరూపమును ము
త్యాల సరుల యురమును గనవచ్చితి
త్యాగరాజ హృద్భూషణ ॥ఓ॥

Sunday, March 20, 2005

ఒరుల నాదుకోవలసినదేమి? పరమ పావన శ్రీరామ

రాగం: శుద్ధ సావేరి
తాళం: ఆది


పల్లవి:
ఒరుల నాదుకోవలసినదేమి?
పరమ పావన శ్రీరామ ॥ఒరుల॥


అను పల్లవి:
పరితాపము తాళక మొఱలిడగా
కరుణ లేక నీవే నను జూడగ ॥ఒరుల॥


చరణము(లు)
మంచివారి సహవాసము బాసి
కొంచెపు నరుల కొఱకు నుతి జేసి
యెంచిన కార్యము గూడని గాసి స
హించ కుండెడిది నా పేరు వాసి ॥ఒరుల॥


రాశియనుచు నరులను చేబూని
వాసి యుండెడిది భవాని
ఆశప్రియ! నే ముందురాని
జేసిన కర్మ ననుకోవలె గాని ॥ఒరుల॥


దేవ త్యాగరాజ వినుత! సనక
భావనీయ! రఘుకుల తిలక!
ఈ వరకును నాదు తను వలయక
నీవే తెలుసుకోవలె గాక ॥ఒరుల॥

Monday, March 14, 2005

ఒకసారి జూడగ రాదా!

పల్లవి:
ఒకసారి జూడగ రాదా! ॥ఒక॥


అను పల్లవి:
సుకవి మానసార్చిత పాద! సదా
శుద్ధాంతరంగ! ముదంబుతో ॥నొక॥


చరణము(లు)
వరులైన దిగీశులు చంద్ర విభా
కర మౌనివరులు, శ్రీరామ! నీ
కరుణా కటాక్షము చేత వెలసిరి
గాన నన్ను త్యాగరాజ వినుత ॥ఒక॥

ఒకమాట ఒకబాణము

రాగం: హరికాంభోజి
తాళం: రూపకము


పల్లవి:
ఒకమాట ఒకబాణము
ఒక పత్నీవ్రతుఁడే మనసా ॥ఒ॥


అను పల్లవి:
ఒకచిత్తము గలవాఁడే
ఒక నాఁడును మఱవకవే ॥ఒ॥


చరణము(లు)
చిర జీవత్వము నిర్జర
వర సొఖ్య మొసంగునె
ధరఁ బరగే దేవుఁడే
త్యాగరాజ నుతుఁడే ॥ఒ॥

ఏహి త్రిజగదీశ! శంభో! మాం

రాగం: సారంగ
తాళం: చాపు


పల్లవి:
ఏహి త్రిజగదీశ! శంభో! మాం
పాహి పంచనదీశ ॥ఏహి॥


అను పల్లవి:
వాహినీశ రిపునుత శివ సాంబ
దేహి త్వదీయ కరాబ్జావలంబం ॥ఏహి॥


చరణము(లు)
గంగాధర ధీర నిర్జర రిపు - పుంగవ సంహార
మంగళకరపురభంగ విధృత సుకు
రం గాప్త హృదయాబ్జభృంగ శుభాంగ ॥ఏహి॥


వారనాజినచేల భవనీరధి తరణ సురపాల
క్రూర లోకభ్రసమీరణ శుభ్రశ
రీర మామకాఘహార పరాత్పర ॥ఏహి॥


రాజశేఖర కరుణాసాగర నగ రాజాత్మజా రమణ
రాజరాజ పరిపూజిత పద త్యాగ
రాజరాజ వృషరాజాధిరాజ ॥ఏహి॥

Sunday, March 13, 2005

ఏలావరార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై

రాగం: ముఖారి
తాళం: ఆది

పల్లవి:
ఏలావరార మెత్తుకొంటివి ఏమికారణము రాముఁడై ఏ...

అనుపల్లవి:
ఆలము సేయుటకా అయోధ్య
పాలనఁ జేయుటకా ఓ రాఘవ ఏ...

చరణములు:
యోగులను జూచుటకా భవ
రోగులను బ్రోచుటకా శత
రాగరత్నమాలికలు రచించిన
త్యాగరాజునకు వర మొసంగుటకా ఏ...