Thursday, June 23, 2005

కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ

రాగం: వరాళి
తాళం: ఆది

పల్లవి:
కరుణ ఏలాగంటే నీ విధమే కల్యాణసుందర రామ క...

అను పల్లవి:
పరమాత్ముఁడు జీవాత్ముఁడు యొకఁడై
బరగుచుండు భక్తపరాధీనుని క...

చరణము(లు)
అనృతంబాడఁడు అల్పుల వేడఁడు
సునృపుల గొలువఁడు సూర్యుని మఱవఁడు క...

మాంసము ముట్టఁడు మధువును త్రాగఁడు
పరహింసల సేయఁడు యెఱుకను మఱవఁడు క...

మూడీషణముల వాడఁడు జీవ
న్ముక్తుఁడై తిరుగు మదమును జూపఁడు క...

వంచన సేయఁడు పరులతో బోంకఁడు
చంచలచిత్తుఁడై సౌఖ్యము విడవఁడు క...

సాక్షి యని దెలిసి యందు లక్ష్యము విడువఁడు కం
జాక్షుని త్యాగరాజ రక్షఁకుడైనవాని క...

కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర

రాగం: బృందావన సారంగ
తాళం: దేశాది

పల్లవి:
కమలాప్తకుల కలశాబ్ధిచంద్ర
కావవయ్య నను, కరుణా సముద్ర! ॥కమలా॥

అను పల్లవి:
కమలా కళత్ర! కౌసల్యా సుపుత్ర!
కమనీయ గాత్ర! కామారి మిత్ర! ॥కమలా॥

చరణము(లు)
మును దాసుల బ్రోచినదెల్ల చాల
విని నీ చరణాశ్రితుఁడైతినయ్య
కనికరంబున నాకభయ మియ్యవయ్య
వనజ లోచన! శ్రీ త్యాగరాజ వినుత ॥కమలా॥

Monday, June 20, 2005

కన్నతల్లి నీవు నా పాలఁగలుగ

రాగం: సావేరి
తాళం: ఆది

పల్లవి:
కన్నతల్లి నీవు నా పాలఁగలుగ
గాసి చెంద నేలనమ్మ ॥క॥

అను పల్లవి:
వెన్నయుండ నేతి కెవరైన
వెసనబడుదురా త్రిపురసుందరి ॥క॥

చరణము(లు)
ఎల్లవారి ధనములశ్వరములు మఱి
ఎక్కువైన గట్టి మిద్దెలన్నియు
కల్లగాని కన్నవారలు
గాంచు సుఖము సున్న యనుచును
ఉల్లసమునను బాగ తెలిసికొంటిని
ఊరకే ధనికల సంభాషణము నే
నొల్ల మాయని దెలిసి రజ్జుపై
యురగబుద్ధి చెందనేల నమ్మానను ॥క॥

పలుకు మంచిగాని భాంధవులు మఱి
బావమరదులక్కలన్నదమ్ములు
కలిమిఁజూచువారు లేమిని
గనులఁగానరారు అనుచును
దలఁచుకొన్నవెనుక వారి మాయల
తగులఁజాలనమ్మా మరుమరీచి
కలను జూచి నీరని భ్రమసి
కందురా ఆదిపురవిహారిణీ నను ॥క॥

కనక భాషణములఁ బెట్టి మఱియు
సొగసుఁజేసి పాలుబోసి పెంచిన
తనువు సతము గాదు నిర్మల
తన మించుకలేదు అనుచును
అనుదిన మొనరించు సత్క్రియల నీ
కని పల్కిన త్యాగరాజరక్షకి
విను మన్నిట నీవనెఱిఁగి వేల్పుల
వేఱని యెంచుదురా త్రిపురసుందరి నను ॥క॥

కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే

రాగం: దేవమనోహరి
తాళం: దేశాది


పల్లవి:
కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే ॥క॥


అను పల్లవి:
నిన్నసేయుపనులు నేఁడుగాక వే
రెన్నలే దనుచు వేమాఱులకు ॥క॥


చరణము(లు)
ఎదురు తాననే ఇంగితం వెఱిఁగి
చెదరనీక పంచేంద్రియ మణంచి నిన్
వదలలేని ధైర్యశాలి గాదని
మదనకోటి రూప త్యాగరాజ నుత ॥క॥

కనులు తాకని పరకాంతల మనసెటులో రామ

రాగం: కల్యాణ వసంత
తాళం: రూపక


పల్లవి:
కనులు తాకని పరకాంతల మనసెటులో రామ ॥క॥


అను పల్లవి:
ననబోణులపై నేరమన నోరేమి రామ ॥క॥


చరణము(లు)
ఘోరభూతపతినిజూచి దారుకారణ్యసతులు
మేరమీఱి భువిని యపదూరు గల్గజేసిరే ॥క॥


మన మోహనానంద మదచకోరనయన కుందర
దన చంద్రవదన సుందరాంగ త్యాగరాజ వినుత ॥క॥

కనుగొను సౌఖ్యము, కమలుజుకైనఁ గల్గునా

రాగం: నాయకి
తాళం: రూపకం


పల్లవి:
కనుగొను సౌఖ్యము, కమలుజుకైనఁ గల్గునా ॥కనుగొను॥


అను పల్లవి:
దనుజు వైరియగు రాముని దయ గల్గిన నతని వినా ॥కనుగొను॥
చరణము(లు)
తనువొకచో మనసొకచో దగిన వేషమొకచో నిడి
జనుల నేచువారికి జయమౌనే త్యాగరాజు ॥కనుగొను॥

కనుగొంటిని శ్రీరాముని నేఁడు

రాగం: బిలహరి

తాళం: దేశాది

పల్లవి:

కనుగొంటిని శ్రీరాముని నేఁడు ॥క॥

అను పల్లవి:

ఇనకులమందు ఇంపుగాను బుట్టిన

ఇలలోన సీతానాయకుని నేఁడు ॥క॥


చరణము(లు)

భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువఁ

బవమానసుతుఁడు పాదములఁ బట్ట

ధీరులైన సుగ్రీవప్రముఖులు

వినుతిసేయ త్యాగరాజనుతుని నేఁడు ॥క॥