Tuesday, January 25, 2005

ఎందరో మహానుభావు లందరికి వందనము

రాగం: శ్రీ
తాళం: ఆది


పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము ॥ఎం॥


అను పల్లవి:
చందురు వర్ణుని యంద చందమును హృదయార
విందమునఁ జూచి బ్రహ్మానంద మనుభవించు వా ॥రెం॥


చరణము(లు)
సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు లెం..


మానస వనచరవర సంచారము సలిపి
మూర్తి బాగుగఁ బొడగనెడు వా రెం...


సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము జేయు వా రెం...


పతితపావనుఁడగు పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమా
ర్గముతోను బాడుచును సల్లాపముతో
స్వరలయాది రాగములఁ దెలియు వా రెం...


హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో
తెలివితోఁ జెలిమితోఁ గరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా రెం...


హొయలుమీర నడలు గల్గు సరసుని
సదాకనులఁ జూచుచును పులక శ
రీరులై యానందపయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల వా రెం...


పరమ భాగవత మౌనివర శశి
విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనకకశిపు
సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్రధర శుక
సరోజభవ భూసురవరులు
పరమపావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక ఎం...


నీ మేని నామ వైభంబులను
నీ పరాక్రమ ధై
ర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమున రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీమది
నెఱింగి సంతతంబునను గుణ భజనా
నంద కీర్తనము జేయు వా రెం...


భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములఁ శివాది షణ్మతముల
గూఢములఁ ముప్పదిముక్కో
టి సురాంతరంగముల భావంబుల
నెఱిఁగి భావ రాగ లయాది సౌఖ్య
ముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా రెం...


ప్రేమ ముప్పిరి గొను వేళ
నామము దలచువారు
రామభక్తుఁడైన త్యాగ
రాజనుతుని నిజదాసులైన వా రెం...